ప్రేమ విఫలం / సఫలం

ప్రేమ

     విఫలం / సఫలం

         నా దృష్టిలో  ప్రేమ చెడ్డది కాదు ,ప్రేమించడం తప్పూ కాదు, కానీ ప్రేమలో పడటం వలన  ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనే మానసిక పరిపక్వత, మనోబలం లేకపోవడం దురదృష్టకరం .
ఇది లేనివారు ప్రేమించడం వారికి అపాయకరం, అని నా ఉద్దేశ్యం.
                     ఉదాహరణకు నాకు తెలిసిన ఫ్రెండ్ చెల్లి పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్ ,కానీ ఇంటర్లో సాధారణ మార్కులతో పాస్ అయింది .దీనికి కారణం ఆ అమ్మాయి ఇంటర్లో ప్రేమలో పడటమే ,అమ్మాయి ఎప్పుడూ ఫోన్ లో ఆ అబ్బాయితో మాట్లాడటం, చాట్ చేయడం ,క్లాస్ రూంలో కూర్చున్న అతని గురించే ఆలోచించడం,
సెలవు రోజులలో కలిసి బయట తిరగడం అతనితో గొడవ ఏదైనా జరిగినప్పుడు మూడీగా ఉండడం, ఏ పని చేయకపోవడం చేస్తుండేది ,ఫలితంగా ఆమె చదువు  పెడదారి పట్టింది.
                      మన సమాజంలో ప్రేమించే వారిలో ఎక్కువ మంది అవతలి వ్యక్తి గురించి పూర్తిగా తెలియ కుండా గానీ తాము ఆ వ్యక్తితో ప్రేమలో విఫలం అయినా, సఫలం అయినా ఎదుర్కోవలసిన ఆర్థిక ,కుటుంబ ,సమాజ పరిస్థితులను సరిగ్గా వాస్తవ దృష్టితో అంచనా వేయకుండా గానీ ,  కాలంతో పాటు మనిషిలో, మనిషి వ్యక్తిత్వంలో చోటు చేసుకునే మార్పులు వంటి వాటి గురించి గానీ ఏ మాత్రం విశ్లేషించుకోకుండా, ఈ విషయాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రేమించేస్తారు.

                      నిజానికి చాలామందికి కౌమారదశలో యవ్వనదశలో ఈ విషయాల పై సరి అయిన అవగాహన ఉండదు ,ప్రేమించే వాళ్ళలో తొంభై శాతం మంది ప్రపంచంలో తమదే  నిజమైన ప్రేమ అని ,తాము ఎప్పటికీ కలిసే బతుకుతాము అని బ్రమలో బతుకుతూ ఉంటారు.
ప్రేమ పెళ్లి ఉద్యోగం వంటి జీవితానికి సంబంధించిన కీలక విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు 360 డిగ్రీల నుండి లాభనష్టాలు ,తప్పొప్పులు, మంచి చెడులు బాగా ఆలోచించి అప్పుడు సరి అయిన నిర్ణయం తీసుకోవాలి.

                      ఈ విధంగా ప్రేమ వలన, ప్రేమించే వ్యక్తి వలన, మన ఉద్యోగం ,కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధ బాంధవ్యాలు, సమాజంలో మన ఇంకా మన పెద్దవాళ్ళ గౌరవ మర్యాదలు, ముఖ్యంగా మన జీవనశైలి ఇవన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి అందుకే పెద్దలు అంటుంటారు, కీడు ఎంచి మేలు ఎంచు అని.కొంతమంది ఇతర కుల ,మత ,ప్రాంతీయ వ్యక్తులను ఇష్టపడటం జరుగుతుంది.
ప్రేమలో ఇద్దరూ ఎవరి జీవితం వారు తమ తమ ఇంటిదగ్గర ఉంటారు ,కాబట్టి వారికి ఈ విషయాల దగ్గర ఎటువంటి సమస్య రాదు ,కానీ

పెళ్లి అయిన తరువాత ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో
జీవించాలి . అసలు సమస్య ఇక్కడ నుండే మొదలవుతుంది ,కులం మతం ప్రాంతం వంటివి వేరువేరు అవడం వలన వారి వారి ఆచార వ్యవహారాలలో ఆహారపు అలవాట్లలో, సంస్కృతి సంప్రదాయాలలో పెను మార్పు చోటు చేసుకుంటుంది. కొన్ని సందర్భాలలో
అత్తగారింటి ఆచారాలను కోడలు లేదా అల్లుడు బాధ్యతాయుతంగా పాటించాల్సి ఉంటుంది ,అప్పుడు అనేక సమస్యలు తలెత్తుతాయి.

                    ఉదాహరణకు తమకు ఇష్టం లేని ,చేతకాని పనులు తమతో బలవంతంగా చేయిస్తున్నారు అని ఆ వ్యక్తుల ఆత్మాభిమానం దెబ్బతింటుంది .అప్పుడు ఆ కాపురం నరకంలాగా అనిపిస్తుంది, అందుకే అంటారు
ప్రేమకు రెండు మనసులు కలిస్తే చాలు కానీ పెళ్లికి మాత్రం రెండు కుటుంబాలు కలవాలి అని,
సాధారణంగా మన శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోను విడుదల అవడం వలన మనకు అవతలి వ్యక్తి మీద ఫీలింగ్స్ ఏర్పడి ప్రేమ పుడుతుంది.

                   ఎదుటి వ్యక్తి వ్యక్తిత్వం ,ఆలోచనా తీరు, చేసే పనులు , మంచి మనసు వంటివి  మనకు నచ్చడం వలన మనకు వాళ్లపై ఇష్టం, అభిమానం ఏర్పడుతాయి,వీటినుండి ప్రేమ చిగురిస్తుంది.
అంతగా మానసిక పరిపక్వత చెందని హృదయాలు ప్రేమలో పడటానికి అనేక కారణాలు ఉంటాయి ,కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు సినిమాలలో ,సీరియల్స్ లో ,నవలలలో తమకు నచ్చిన హీరో హీరోయిన్లు ప్రేమించడం ,సమాజంలో తోటి స్నేహితుల లో ఒక స్టేటస్ కోసం ,ప్రేమించడం ఒక స్టైల్ అని తమలో తాము భ్రమపడుతూ ప్రేమలో పడుతుంటారు.

                    నాకు తెలిసిన ఒక అబ్బాయి బాగా చదువుతాడు కాలేజీకి రెగ్యులర్గా వెళతాడు ,కాని అతడి బలహీనత తన ఫ్రెండ్స్ ఏది చేస్తే అది చేయడం . అతను తన ఫ్రెండ్స్ ప్రేమిస్తున్నారని తను కూడా ప్రేమించి ప్రేమలో ఫెయిల్ అయ్యి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.ఈ విధంగా స్నేహితుల ప్రత్యక్ష ,పరోక్ష ప్రభావం వలన ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.

                              ఇక్కడ మన కుటుంబ వాతావరణం గురించి మాట్లాడుకోవాలి ,కొంతమంది తల్లిదండ్రులు అతి క్రమశిక్షణ ,కట్టుబాట్లు విధించడం వలన, పిల్లలతో ఎక్కువ సమయం గడపకుండా వారికి తగినంత ప్రేమాభిమానాలను పంచక పోవడం వలన, పిల్లలు తమతో ఎవరు చనూగా మాట్లాడినా ప్రేమగా పలకరించి ,కొద్దిపాటి ఆప్యాయత అనురాగం చూపించి , తమ పై శ్రద్ధ కనబరిచినా ,వెంటనే ప్రేమలో  పడిపోతుంటారు.

                      అందం ,ఆస్తి ,చదువు ,ఉద్యోగం ,అధికారం ,పలుకుబడి స్టైల్, హీరోయిజం ,వంటి వాటిని చూసి కూడా చాలా మంది ప్రేమలో పడతారు .కానీ ఇటువంటి ప్రేమలు ఎక్కువ కాలం నిలబడవు,వీటిని చూసి ప్రేమించిన వారు ఎదుటి వ్యక్తిలో ఇవి తగ్గినప్పుడు లేదా పోయినప్పుడు వారి నుండి దూరంగా వెళ్లి పోతారు.
                                 మరికొంత మంది వ్యక్తులు అయితే ఏదో ప్రేమిస్తారు వారి ప్రేమకు సరిఅయిన స్పష్టమైన కారణాలు ఉండవు ,వీటిని టైం పాస్ ప్రేమలుగా చెప్పుకోవచ్చు .బతకడానికి తినాలి అన్నట్టు ,మనిషిగా పుట్టినందుకు మనసు ఉన్నందుకు ప్రేమిస్తారు . వీరిలో నిజాయితీ గానీ ప్రేమ కోసం ఏమైనా చేయగలిగే సాహసం గాని అస్సలు ఉండవు.బతకడానికి ఒక తోడు అవసరం కాబట్టి ,తమ సుఖ దుఖాలను ,సంతోష బాధలను పంచుకోవడానికి కలిసి బతకడానికి ఒక వ్యక్తి కావాలి అనిపించి చాలా తక్కువ మంది ప్రేమిస్తారు ఇటువంటి ప్రేమలో అంచనాలు,ఆశలు ఎక్కువగా ఉండవు కాబట్టి ఇవి చివరి వరకు నిలుస్తాయి.

                         మన దగ్గరికి ఎవరైనా వచ్చి, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ,మన అంచనాలను వారు అందుకుంటున్నప్పుడు,వారిలోని సుగుణాలు మనకు  నచ్చినప్పుడు మనం తిరిగి ప్రేమిస్తాం. ఇది అందరికీ తెలిసిన విషయమే ,కానీ కొంతమంది ప్రేమికులు కొంతకాలం ప్రేమించుకుని కలిసి బయట తిరిగి ,తర్వాత విడిపోతారు .ఈ విడిపోవడం అనేది ఇద్దరికీ ఇష్టం అయితే పరవాలేదు తర్వాత ఎవరి జీవితం వారు మామూలుగా జీవించవచ్చు .కానీ ఒకరికి విడిపోవాలి అని ఇంకొకరికి కలిసుండాలి అని ఉంటే అప్పుడు అందులో ఒక జీవితం నాశనం అయిపోతుంది.

                         ప్రేమ ,ప్రేమించిన వ్యక్తి చేసిన గాయం మానడానికి చాలా కాలం పడుతుంది .ఈలోపు వారు విలువైన కాలాన్ని, జీవితాన్ని, ఏకాగ్రత లోపించడం వలన చదువు, ఉద్యోగాలను ,మనశ్శాంతిని కోల్పోతారు. ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేక ఆ బాధ నుండి విముక్తి కొరకు మద్యం ,సిగరెట్ వంటి చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి  కుటుంబంలో ఇంకా సమాజంలో గౌరవ మర్యాదలను చేజార్చుకుంటారు .మళ్ళీ తిరిగి సంపాదించుకోలేని ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటారు.
                        ప్రేమలో అవతలి వ్యక్తి కారణాలు చెప్పకుండా మనల్ని దూరం పెడుతున్నప్పుడు మనల్ని పట్టించుకోకుండా వేరే వ్యక్తులకి, విషయాలకి ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు ,మన మనసు తల్లడిల్లి పోతుంది ,మన గుండె రగిలిపోతోంది, ఈ ఆవేదన నుండి అనేక చెడు ఆలోచనలు వస్తాయి .   ఆ వ్యక్తిని మానసికంగా శారీరకంగా య హింసించాలని, తను సంతోషంగా హాయిగా ఉండకూడదు అనే శాడిజం, తనని అనేక రకాలుగా బ్లాక్మెయిల్ చెయ్యాలి అనిపించడం ,తన చదువు ఉద్యోగం పెళ్లి వంటి వాటిని పాడు చెయ్యాలనే మనస్తత్వం పుట్టుకొస్తాయి.
                            కొంత కాలం ప్రేమించుకున్న తరువాత ఎందుకు విడిపోవాలని అనిపిస్తుందో ఇప్పుడు మనం చర్చించుకుందాం .అమ్మాయిలైనా,అబ్బాయిలైనా ఎవరినైనా చూసి విపరీతమైన అంచనాలతో వారిని ప్రేమిస్తారు .కాలం గడిచే కొద్ది అవతలి మనిషి లో ,వ్యక్తిత్వంలో మార్పులు చోటు చేసుకుంటున్నప్పుడు లేదా తమలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు,అవతలి వారు తమ అంచనాలను అందుకోలేక పోతున్నప్పుడు,లేదా తమకు వేరే ఒకరు పరిచయం అయ్యి ముందు వ్యక్తి కంటే అన్నిటిలో ఈ వ్యక్తి నయం అనిపించి , నిర్ణయాలు మార్చుకున్నప్పుడు  విడిపోవాలనిపిస్తుంది ,కానీ చాలామంది విడిపోవడానికి గల కారణాలను ,ఎదుటి వ్యక్తిలో ఇప్పుడు తమకు నచ్చని విషయాలను, చెప్పడానికి భయపడి మొహమాటపడి ,వారితో స్పష్టంగా చెప్పకుండా దూరంగా ఉంటూ వాళ్లని దూరం పెడుతూ ఉంటారు.
                          ఒక అమ్మాయి ప్రేమలో పడినప్పుడు ఆ అబ్బాయికి అందంగానే ఉంటుంది కానీ కలిసి బయట తిరిగాక హద్దులు దాటి ప్రవర్తించాకా ,అందాన్ని అనుభవించాక ఆమెపై వ్యామోహం తగ్గి , వేరే ఒకరి పై ఇష్టం పెరుగుతుంది అప్పుడు ఆ అబ్బాయికి అమ్మాయి తో విడిపోవాలని అనిపిస్తుంది .
                           అమ్మాయిలు విడిపోవడానికి ముఖ్య కారణాలు ఈ విధంగా ఉండవచ్చు,ఇంట్లో మంచి సంబంధం తెచ్చినప్పుడు ,కంపెనీలో లేదా కాలేజీలో ఇంతకంటే బెటర్ ఛాయిస్ దొరికినప్పుడు అమ్మాయికి విడిపోవాలని అనిపించడం  వారి దృష్టిలో తప్పు లేదు కానీ అబ్బాయిలు దృష్టిలో చాలా పెద్ద తప్పు.
అలాగే అబ్బాయిలు విడిపోవడానికి ముఖ్య కారణాలు అందాన్ని అనుభవించడం, ప్రేమలో ఏముందో తెలిసి పోవడం ,ఇంకా కట్న కానుకల పై ఆశ పుట్టడం ,ఇంట్లో వారిపై భయ భక్తులు ఉండటం ముఖ్య గా చెప్పుకోవచ్చు.

                         కొంతమంది ప్రేమించడం మొదలు పెట్టిన సమయంలో అవతలి వ్యక్తిలో కొన్ని విషయాలు నచ్చి ప్రేమిస్తారు, కానీ కాలం గడిచే   కొద్దీ వీరిలో మనుషులను చూసే దృష్టిలోనూ, పరిస్థితులను విశ్లేషించే సామర్థ్యం లోనూ, నైతిక విలువలలోనూ మార్పు చోటు చేసుకోవడం వలన అన్నింటికంటే ముఖ్యంగా కొత్తదనం కోరుకోవడం వలన ఎదుటి వారు తమకు నచ్చరు కానీ అవతలి వారు ముందు ఉన్నట్టే ఉంటారు తప్పు వారిలో కాదు వీరిలో వీరి వ్యక్తిత్వంలో ,వ్యక్తిత్వం మారడం లో అభిరుచులు మారడంలో ఉంది.

                       ఇలా ప్రేమలో వదిలివేయబడ్డ వారు ,ప్రేమలో విఫలం అయిన వారు ఆత్మహత్యలు చేసుకోవడం తమని తాము గాయపరుచుకోవడం, తాము బాధ పడుతూ ఇంట్లో వారిని బాధపెడుతూ ఉండటం చేస్తుంటారు. వదిలేసిన వారిని తిరిగి ప్రేమించమని బతిమలాదుతూ అనవసరంగా కాలాన్ని వృథా చేసుకుంటారు .

            కానీ ప్రేమలో ఒక్కసారి మనసు మారి విడిపోవాలి అనిపించాక ఇంక ఆ వ్యక్తి ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా మారరు .మార్చాలన్న ప్రయత్నం చేయడం కూడా అనవసరం .వారు ప్రేమలోనే ఇలా చేశారు  పెళ్లి తర్వాత ఇలా వదిలేసి వెళ్ళిపోయుంటే నూరేళ్ళ జీవితం నాశనం అయ్యేది అని అనుకుని సరిపెట్టుకోవాలి అంతే.

ప్రపంచం లో పరిష్కారాలు లేని సమస్యలు చాలా ఉన్నాయి , వాటిలో ముఖ్యమైనది ‘ ప్రేమ'.

Comments

Popular posts from this blog

మానవత్వం vs విలువలు

కుటుంబం...పార్ట్3

చేతిలో చావు...పార్ట్3